రోజుకి ఎన్ని అడుగులు నడిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు..?
సాక్షి లైఫ్ : మనం రోజంతా చాలా నడుస్తాం కానీ దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనకు తెలియదు. తెలిసో తెలియకో కార్డియో వర్కవుట్ చేస్తూ ఉంటాం. బరువు తగ్గడం కోసం ప్రత్యేకంగా చేసే వర్కవుట్ ఇది. మీ స్మార్ట్‌వాచ్‌లో ఎన్ని అడుగులు నడిస్తున్నామో లెక్కించడం ద్వారా పొట్ట చుట్టూ ఉన్నకొవ్వును తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
మాయో క్లినిక్ ప్రకారం.. ఊబకాయ సమస్య నుంచి బయటపడాలంటే, ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వేగంగా నడవాల్సి ఉంటుంది. దీనికారణంగా ప్రతిరోజూ 150 కేలరీలు బర్న్ అవుతాయి. ప్రతిరోజూ కనీసం 6,000 అడుగులు నడవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. క్రమపద్ధతిలో నడవడం ద్వారా తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. రోజూ 30 నిమిషాల పాటు వేగంగా నడవడం వల్ల క్యాన్సర్, డయాబెటిస్, స్ట్రోక్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని, అంతేకాదు తద్వారా ద్వారా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
కేలరీలు బర్న్ ..
వేగంగా నడవడం వల్ల శరీరంలోని అదనపు కేలరీలు బర్న్ అవుతాయి. శరీరానికి రోజువారీ కేలరీల అవసరం పూర్తయిన తర్వాత, శరీరంలో మిగిలి ఉన్న కేలరీలు పొట్ట వద్ద పేరుకుపోతాయి. తద్వారా ఊబకాయ సమస్య తలెత్తుతుంది. నడవడం వల్ల ఈ క్యాలరీలు కరిగిపోయి బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. నడవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గడమేకాకుండా, మరోవైపు శరీరంలో కండరాలు దృఢంగా మారుతాయి. కండరాలు స్ట్రాంగ్ గా అయ్యే క్రమంలో మరింతగా కేలరీలు బర్న్ అవుతాయి.
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం..
వాకింగ్ చేయడం వల్ల ఆర్థరైటిస్ నొప్పిల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు" అని హార్వర్డ్ యూనివర్శిటీ నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. నడవడం వల్ల శరీరంలోని చాలా కండరాలు చురుకుగా మారతాయి. తద్వారా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వారానికి 8 నుంచి 9 కిలోమీటర్ల దూరం నడవడం వల్ల కీళ్లనొప్పులు రాకుండా నివారించవచ్చు.
మానసిక ప్రశాంతత..
ప్రతిరోజూ 30 నిమిషాల పాటు ఒంటరిగా, ప్రశాంతంగా పార్కులో నడవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కోపం, ఒత్తిడి, ఆందోళన మొదలైన సమస్యలను తొలగించడంలో నడక ప్రభావవంతంగా పనిచేస్తుందని, హార్వర్డ్ యూనివర్శిటీ నిర్వహించిన పరిశోధనలో రుజువైంది.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
