PSA Blood Test : ప్రోస్టేట్ క్యాన్సర్ ను ముందుగా గుర్తించే ‘పి.ఎస్.ఏ’ రక్త పరీక్ష..!

షేర్ చేయండి:
PSA Blood Test : ప్రోస్టేట్ క్యాన్సర్ ను ముందుగా గుర్తించే ‘పి.ఎస్.ఏ’ రక్త పరీక్ష..!

సాక్షి లైఫ్ : మారుతున్న ఆధునిక జీవనశైలి, పెరుగుతోన్న వయసుతో పాటు పురుషుల్లో గుండె జబ్బులు, మధుమేహంతో సమానంగా ప్రోస్టేట్ సమస్యలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పురుషులను వేధిస్తోన్న క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ అత్యంత సాధారణమైనదిగా మారుతోంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ గణాంకాల ప్రకారం.. పురుషుల్లో వచ్చే క్యాన్సర్లలో ఇది రెండో స్థానంలో ఉండగా, క్యాన్సర్ మరణాలకు దారితీస్తోన్న కారణాల్లో ఐదో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 4 లక్షల మంది ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోతుండగా, 15 లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.

ఈ మహమ్మారిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు ‘ప్రోస్టేట్-స్పెసిఫిక్ యాంటిజెన్’ (PSA) అనే సాధారణ రక్త పరీక్ష ఎంతో దోహదపడుతుందని చెప్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

ఇది కూడా చదవండి..  ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

 

‘పి.ఎస్.ఏ’ (PSA) పరీక్ష అంటే ఏమిటి..?

ప్రోస్టేట్ గ్రంథిలో సంభవించే మార్పులను గుర్తించడానికి చేసే ఒక సులభమైన రక్త పరీక్షే ఈ ‘పి.ఎస్.ఏ’. పౌరుష గ్రంథి సహజంగానే రక్తంలోకి కొంత మొత్తంలో ‘ప్రోస్టేట్-స్పెసిఫిక్ యాంటిజెన్’ అనే ప్రోటీన్‌ను విడుదల చేస్తుంది. అయితే, ఈ గ్రంథిలో ఏవైనా అసాధారణ మార్పులు లేదా వాపు సంభవించినప్పుడు రక్తంలో పి.ఎస్.ఏ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి.

వ్యాధి నిర్ధారణ ఎలా చేస్తారంటే..?

కేవలం పి.ఎస్.ఏ స్థాయిలు పెరిగినంత మాత్రాన క్యాన్సర్ ఉన్నట్లు కాదు. కొన్నిసార్లు సాధారణ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఇవి పెరగవచ్చు. అందుకే వైద్యులు రోగి వయసు, మెడికల్ హిస్టరీని పరిశీలించి, అవసరమైతే బయాప్సీ వంటి ఇతర పరీక్షల ద్వారా క్యాన్సర్‌ను నిర్ధారిస్తారు.

పరీక్ష ఎవరికి అవసరం..?

చాలా సందర్భాల్లో ఈ వ్యాధి ముదిరే వరకు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అందుకే ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

50 ఏళ్లు పైబడిన వారు..

సాధారణంగా 50 ఏళ్లు దాటిన పురుషులందరూ వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా ప్రోస్టేట్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి.

కుటుంబ చరిత్ర ఉన్నవారు..

కుటుంబంలో తండ్రి, సోదరుడు లేదా ఇతర రక్తసంబంధీకులకు ప్రోస్టేట్ క్యాన్సర్ చరిత్ర ఉంటే ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. వీరు 45 ఏళ్ల వయసు నుంచే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం సురక్షితం.

గమనించాల్సిన ముఖ్య లక్షణాలు..

ప్రోస్టేట్ సమస్యలు తలెత్తినప్పుడు కనిపించే కొన్ని సాధారణ సంకేతాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. అయితే ఇవి కేవలం క్యాన్సర్ వల్లే కాకుండా సాధారణ ప్రోస్టేట్ వాపు (BPH) వల్ల కూడా కావచ్చు:

తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం (ముఖ్యంగా రాత్రి వేళల్లో).

మూత్రవిసర్జన ప్రారంభించడంలో ఇబ్బంది లేదా ప్రవాహం బలహీనంగా ఉండటం.

మూత్రం లేదా వీర్యంలో రక్తం కనిపించడం.

కటి వలయం (Pelvic region) లేదా నడుము కింది భాగంలో తరచుగా నొప్పి రావడం.

వయసు పెరుగుతున్న కొద్దీ పురుషులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎలాంటి లక్షణాలు లేకపోయినా వైద్యుల సలహాతో వార్షిక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఇలాంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..  మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.