Menopause in Women : మెనోపాజ్ సగటు వయస్సు ఎంత..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మహిళల జీవితంలో శారీరకంగా, హార్మోన్ల పరంగా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అందులో అత్యంత కీలకమైన, సహజమైన దశ 'మెనోపాజ్' అంటే నెలసరి శాశ్వతంగా ఆగిపోవడం. వయస్సు పెరిగే కొద్దీ ప్రతి మహిళ జీవితంలోనూ ఈ ప్రక్రియ సహజంగానే జరుగుతుంది. అయితే, సమాజంలో మెనోపాజ్ చుట్టూ అనేక అపోహలు, అపార్థాలు ప్రచారంలో ఉన్నాయి. దీనివల్ల చాలా మంది మహిళలు అనవసర ఆందోళనకు, గందరగోళానికి గురవుతుంటారు. మెనోపాజ్ అనేది ఒక వ్యాధి కాదు, అది ఒక సాధారణ జీవక్రియ అని గుర్తించడం ఎంతో అవసరం. ఈ దశలో శరీరంలో వచ్చే మార్పులు, లక్షణాలు, వాటిని అధిగమించే మార్గాలపై సాక్షి లైఫ్ ప్రత్యేక విశ్లేషణ.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

అసలు మెనోపాజ్ అంటే ఏమిటి..?

మహిళల్లో అండాశయాలు క్రమంగా అండాల ఉత్పత్తిని నిలిపివేసి, రుతుచక్రం శాశ్వతంగా ఆగిపోయే దశను మెనోపాజ్ అంటారు. ఇది వృద్ధాప్యంలో ఒక సహజమైన భాగం. ఈ కాలంలో శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి కీలక హార్మోన్ల స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. ఫలితంగా శారీరక మార్పులతో పాటు మానసిక స్థితిలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తాయి.

సగటు వయస్సు ఎంత..?

మెనోపాజ్ వచ్చే వయస్సు అందరి మహిళల్లో ఒకేలా ఉండకపోవచ్చు. కొందరిమహిళలలో కొంచెం అటుఇటుగా వయసు  మారవచ్చు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇది 45 నుంచి 55 సంవత్సరాల వయస్సు మధ్య సంభవిస్తుంది. భారతదేశంలో మహిళల్లో దీని సగటు వయస్సు సుమారు 46 నుంచి 50 సంవత్సరాలుగా వైద్య నిపుణులు వెల్లడిన్నారు. ఒకరి జన్యువులు, జీవనశైలి, తీసుకునే ఆహార అలవాట్లు, వారి ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా ఈ వయస్సులో మార్పులు ఉండవచ్చు.

ప్రధాన లక్షణాలు ఇవే..

నెలసరి పూర్తిగా ఆగిపోవడానికి కొన్ని నెలల ముందు నుండే శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి.

క్రమరహిత నెలసరి..

 పీరియడ్స్ వచ్చే సమయాల్లో మార్పులు వస్తాయి. కొన్నిసార్లు ముందుగానే లేదా మరికొన్నిసార్లు ఆలస్యంగా రావచ్చు.

హాట్ ఫ్లాషెస్..

హఠాత్తుగా ఒంట్లో వేడి పెరగడం, ముఖం, మెడ భాగంలో విపరీతంగా చెమటలు పట్టడం, చంచలత్వం వంటివి ప్రధానంగా కనిపిస్తాయి.

మానసిక మార్పులు..

హార్మోన్ల అసమతుల్యత కారణంగా చిన్న విషయాలకే చిరాకు రావడం, ఆందోళన, భావోద్వేగ అస్థిరత (Mood Swings) వంటి సమస్యలు వేధిస్తాయి.

నిద్రలేమి..

 రాత్రి వేళల్లో సరిగ్గా నిద్రపట్టకపోవడం లేదా తరచుగా మెలకువ రావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.

బరువు పెరగడం..

 ఈ సమయంలో శరీరంలో జీవక్రియ (Metabolism) మందగించడం వల్ల బరువు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఎముకల సాంద్రత కూడా తగ్గుతుంది.

అపోహలు,నిజాలు..

అపోహ 1: మెనోపాజ్ అనేది ఒక పెద్ద అనారోగ్య సమస్య.

నిజం: ఇది ఏ వ్యాధికి సంకేతం కాదు. ప్రతి మహిళా ఎదుర్కొనే అత్యంత సహజమైన శారీరక ప్రక్రియ మాత్రమే.

అపోహ 2: ఇది వృద్ధాప్యం ముదిరిన తర్వాతే వస్తుంది.

నిజం: సాధారణంగా ఇది 45 నుంచి 55 ఏళ్ల మధ్య వస్తుంది. కొందరిలో అంతకంటే ముందే వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.

ముందస్తు మెనోపాజ్ (Early Menopause) వస్తే..?

ఒకవేళ మహిళల్లో 40 ఏళ్ల కంటే ముందే నెలసరి పూర్తిగా ఆగిపోతే దానిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. శరీరంలో తీవ్రమైన హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ సమస్యలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లేదా ఇతర అంతర్గత ఆరోగ్య కారణాల వల్ల ఇలా ముందే మెనోపాజ్ వచ్చే ప్రమాదం ఉంది. ఇటువంటి సందర్భాలలో వైద్యులు అసలు కారణాన్ని తెలుసుకోవడానికి FSH, LH, ఎస్ట్రాడియోల్ వంటి కొన్ని ముఖ్యమైన హార్మోన్ పరీక్షలను సిఫార్సు చేస్తారు.

ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన చిట్కాలు..

సమతుల్య జీవనశైలి ద్వారా మెనోపాజ్ దశను ఎంతో సులభంగా మరియు సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు. పోషకాహారం..ఎముకల ఆరోగ్యం కోసం కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండే పాలు, పెరుగు, ఆకుకూరలు, రాగులు వంటి ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలి. క్రమబద్ధమైన వ్యాయామం.. నిత్యం తేలికపాటి వ్యాయామాలు, నడక లేదా యోగా చేయడం వల్ల శరీరం చురుగ్గా ఉండి బరువు అదుపులో ఉంటుంది.

మానసిక ప్రశాంతత కోసం ధ్యానం అలవాటు చేసుకోవాలి. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల పాటు ప్రశాంతమైన నిద్ర అవసరం. మెనోపాజ్ సమయంలో శారీరక, మానసిక మార్పులు మరీ ఎక్కువగా ఉండి దైనందిన జీవితానికి ఇబ్బంది కలిగిస్తుంటే, సంకోచించకుండా లేడీ డాక్టర్‌ను సంప్రదించి తగిన సలహాలు, అవసరమైతే చికిత్స తీసుకోవడం మంచిది.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.