Pregnancy care tips : గర్భధారణ సమయంలో రాత్రిపూట కంటిమీద కునుకు ఉండడం లేదా..? ఈ జాగ్రత్తలు మీ కోసమే..!

షేర్ చేయండి:
Pregnancy care tips : గర్భధారణ సమయంలో రాత్రిపూట కంటిమీద కునుకు ఉండడం లేదా..? ఈ జాగ్రత్తలు మీ కోసమే..!

సాక్షి లైఫ్ : గర్భధారణ అనేది ప్రతి మహిళ జీవితంలోనూ ఎంతో మధురమైన ఘట్టం. అయితే ఈ సమయంలో శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు అటు శారీరకంగా, ఇటు మానసికంగా పలు సవాళ్లను తెచ్చిపెడుతుంటాయి. వీటిలో ప్రధానంగా చాలామంది గర్భిణులను వేధించే సమస్య.. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం. పొట్ట పరిమాణం పెరగడం, తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, కాళ్ల నొప్పులు, ఒత్తిడి వంటి కారణాల వల్ల కంటి నిండా నిద్ర కరువవుతుంది. గర్భధారణ సమయంలో నిద్రలేమి అనేది కేవలం తల్లి ఆరోగ్యాన్నే కాకుండా, గర్భంలోని శిశువు ఎదుగుదలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ దశలో హాయిగా నిద్రపోవడానికి వైద్యులు సూచిస్తున్న కొన్ని సులభమైన, సురక్షితమైన చిట్కాలు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..! 

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

సుఖనిద్ర కోసం ఈ అలవాట్లు చేసుకోండి..

ఎడమ వైపునకే పడుకోండి.. గర్భిణులు వీలైనంత వరకు ఎడమ వైపునకు తిరిగి పడుకోవడం (left lateral position) ఉత్తమమని వైద్యులు చెబుతారు. దీనివల్ల గర్భాశయానికి, లోపలి శిశువుకు రక్తప్రసరణ, పోషకాల సరఫరా మెరుగ్గా సాగుతుంది.

ప్రత్యేక దిండ్ల (Pregnancy Pillows) ఆసరా..

పడుకునేటప్పుడు పొత్తికడుపునకు, వెన్నుభాగానికి, కాళ్ల మధ్యన సౌకర్యవంతమైన దిండ్లను ఉంచుకోవడం వల్ల శరీరానికి మంచి సపోర్ట్ లభిస్తుంది. ఇది ఒళ్లు నొప్పులను తగ్గించి హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.

నిద్రకు ఒక గంట ముందే ‘స్క్రీన్’ బంద్..

 రాత్రి పడుకోవడానికి గంట ముందే మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలకు దూరంగా ఉండాలి. వీటి నుంచి వచ్చే నీలి రంగు కాంతి (బ్లూ లైట్) నిద్రకు కారణమయ్యే ‘మెలటోనిన్’ హార్మోన్ ఉత్పత్తిని దెబ్బతీస్తుంది.

రాత్రి ఆహారం తేలికగా ఉండాలి: రాత్రి వేళల్లో మసాలాలు, నూనెలు ఎక్కువగా ఉండే భారీ ఆహారానికి దూరంగా ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే పోషకాహారం తీసుకోవడం వల్ల అజీర్తి, గుండెల్లో మంట (ఎసిడిటీ) వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

కెఫిన్‌కు దూరంగా..: సాయంత్రం దాటిన తర్వాత టీ, కాఫీలు, చాక్లెట్లు వంటి కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోకపోవడమే మంచిది. ఇవి మెదడును ఉత్తేజపరిచి నిద్రను దూరం చేస్తాయి.

నిర్దిష్ట సమయం పాటించండి.. ప్రతిరోజూ రాత్రి ఒకే సమయానికి పడుకోవడం, ఉదయాన్నే ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. ఇది శరీర జీవ గడియారాన్ని ( body's biological clock) క్రమబద్ధీకరిస్తుంది.

లఘు వ్యాయామాలు, నడక.. వైద్యుల సలహా మేరకు పగటిపూట చిన్నపాటి నడక లేదా గర్భిణులు చేయదగిన తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఇది శరీరాన్ని చురుకుగా ఉంచి, రాత్రికి అలసట వల్ల త్వరగా నిద్రపట్టేలా చేస్తుంది.

ప్రశాంతత కోసం ధ్యానం.. పడుకునే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి లోతైన శ్వాస ప్రక్రియలు (deep breathing exercises), ధ్యానం లేదా నచ్చిన మెలోడీ సంగీతం వినడం వంటివి అలవర్చుకోవాలి.

వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి..?

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నిరంతరాయంగా నిద్రలేమి వేధిస్తున్నా, విపరీతమైన ఆందోళన చెందుతున్నా లేదా ఈ సమస్య రోజువారీ దినచర్యపై తీవ్ర ప్రభావం చూపుతున్నా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించి తగిన సలహా తీసుకోవాలి. తగినంత విశ్రాంతి, ప్రశాంతమైన నిద్ర గర్భిణులకు శ్రీరామరక్ష. కాబట్టి చిన్నచిన్న మార్పులతో ఆరోగ్యకరమైన మాతృత్వాన్ని ఆస్వాదించండి..!

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.