Eye Tests Can Detect Life-Threatening Diseases : కంటి పరీక్షలతో ప్రాణాంతక వ్యాధులకు చెక్..
సాక్షి లైఫ్ : సాధారణంగా చూపు మసకబారినప్పుడో లేదా కొత్త అద్దాలు కావాలన్నప్పుడో మాత్రమే మనం కంటి వైద్యుడిని సంప్రదిస్తాం. కానీ, కళ్లు కేవలం చూడటానికే కాదు.. మన శరీరంలోని అంతర్గత ఆరోగ్యానికి 'అద్దం'లా పనిచేస్తాయని మీకు తెలుసా? అవును, ఒక సమగ్ర కంటి పరీక్ష ద్వారా కేవలం కంటి సమస్యలే కాకుండా, మెదడు కణితుల (Brain Tumors) నుంచి ప్రాణాంతక స్ట్రోక్ వరకు అనేక వ్యాధులను ముందే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ ప్రకారం.. శరీరంలోని నరాలు, రక్తనాళాలను నేరుగా, స్పష్టంగా చూడగలిగే ఏకైక మార్గం కంటి పరీక్షే. వైద్యులు కనుపాపలను విడదీసి పరీక్షించినప్పుడు శరీరంలో పొంచి ఉన్న ఏయే ముప్పులు బయటపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
బీపీ.. గుండె ముప్పు..!
కంటి వెనుక భాగంలో ఉండే రక్తనాళాలు అసాధారణంగా ఉబ్బినా లేదా అక్కడ చిన్న రక్తపు మచ్చలు కనిపించినా.. అది తీవ్రమైన 'అధిక రక్తపోటు'కు (High BP) సంకేతం. ఇది భవిష్యత్తులో గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిక.
మెదడులో కణితి (Brain Tumor)
మెదడులో కణితి ఏర్పడినప్పుడు అది కలిగించే ఒత్తిడి కంటిలోని 'ఆప్టిక్ నరం'పై పడుతుంది. దీనివల్ల ఆ నరం వాపు రావడం, వస్తువులు రెండుగా కనిపించడం (Double vision), కనుపాప పరిమాణంలో ఆకస్మిక మార్పులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పక్క చూపు (Peripheral vision) తగ్గడం కూడా మెదడులోని సమస్యను సూచిస్తుంది.
పక్షవాతం (Stroke)..
రెటీనాలోని రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినా లేదా రక్తం గడ్డకట్టినా చూపు అకస్మాత్తుగా మసకబారుతుంది. కళ్ల ముందు ఏదో ముసుగు కప్పినట్లు అనిపిస్తే అది 'స్ట్రోక్' వచ్చే అవకాశం ఉందని చెప్పడానికి ఒక ప్రధాన హెచ్చరికగా భావించాలి.
మధుమేహం (Diabetes)..
డయాబెటిక్ రెటినోపతీ అనేది మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో వచ్చే ప్రధాన సమస్య. రెటీనా సిరల నుండి రక్తం కారడం లేదా పసుపు రంగు ద్రవం స్రవించడం వంటివి కనిపిస్తే, అది రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పాయని చెప్పడానికి నిదర్శనం.
థైరాయిడ్, ఇతర సమస్యలు..
కళ్లు అసాధారణంగా ఉబ్బినట్లు కనిపించినా లేదా కనురెప్పలు వెనక్కి లాగబడుతున్నట్లు అనిపించినా అది థైరాయిడ్ సమస్య కావచ్చు. ఆశ్చర్యకరంగా సిఫిలిస్, హెర్పెస్, హెచ్‌ఐవి (HIV) వంటి వ్యాధుల లక్షణాలు కూడా కళ్లలో ప్రతిబింబిస్తాయి.
ఎండకు కళ్లు కమిలిపోతాయా..?
మన చర్మం లాగే కళ్లు కూడా సూర్యరశ్మి కిరణాల(UV rays) వల్ల దెబ్బతింటాయి. దీనిని 'ఫోటోకెరటైటిస్' అంటారు. కళ్లు ఎర్రబడటం, తీవ్రమైన మంట, నొప్పి దీని ప్రధాన లక్షణాలు. ఎండలో వెళ్లేటప్పుడు నాణ్యమైన సన్ గ్లాసెస్ ధరించాలి. కళ్లు నొప్పిగా అనిపిస్తే చల్లటి కాపడాలు పెట్టడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. కంటి పరీక్ష కేవలం అద్దాల కోసం మాత్రమే కాదు.. మీ సంపూర్ణ ఆరోగ్యం కోసం. ఏడాదికి ఒకసారైనా సమగ్ర కంటి పరీక్ష చేయించుకోవడం ద్వారా అనేక వ్యాధులను తొలి దశలోనే గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..?
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
