Memories May Survive After Death..: మరణం తర్వాతా జ్ఞాపకాలు సజీవం..! వైద్య రంగంలో సంచలన ఆవిష్కరణ..
సాక్షి లైఫ్ : మరణాన్ని జయించడం సాధ్యమేనా..? చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించవచ్చా..? ఇవన్నీ ఇప్పటివరకు సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితం. కానీ, ఆధునిక విజ్ఞానశాస్త్రం ఇప్పుడు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. మరణించిన తర్వాత కూడా జీవుల మెదడును, అందులోని సూక్ష్మ కణ నిర్మాణాన్ని దెబ్బతినకుండా భద్రపరచవచ్చని శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా నిరూపించారు. అమెరికాకు చెందిన ‘నెక్టోమ్’ (Nectome) అనే స్టార్టప్ కంపెనీ పందుల మెదళ్లపై చేసిన ఈ పరిశోధన ఇప్పుడు అంతర్జాతీయ వైద్య రంగంలో సరికొత్త ఆశలను రేకెత్తిస్తోంది.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
అసలేమిటీ ప్రయోగం..? ఎలా భద్రపరిచారు..?
మనిషి ఆలోచనలు, జ్ఞాపకాలు, వ్యక్తిత్వం అన్నీ మెదడులోని న్యూరాన్లు, వాటి మధ్య ఉండే అనుసంధానాల (Connectome) నెట్‌వర్క్‌లోనే దాగి ఉంటాయని శాస్త్రవేత్తల నమ్మకం. చనిపోయిన కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు విచ్ఛిన్నం కావడం ప్రారంభిస్తాయి. అలా జరగకుండా నెక్టోమ్ శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరించారు.రసాయన ప్రక్రియ..పంది మరణించిన 10 నిమిషాల వ్యవధిలోనే దాని శరీరం నుంచి రక్తాన్ని బయటకు తీసి, కణాలు పాడవకుండా ఉండే ప్రత్యేక రసాయనాలను మెదడులోకి ఎక్కించారు. కణాల రక్షణ..మెదడులోని నీటి స్థానంలో మంచు స్ఫటికాలు ఏర్పడకుండా నిరోధించే ఒక ప్రత్యేక ద్రవాన్ని నింపారు.
శీతలీకరణ..
అనంతరం మెదడు ఉష్ణోగ్రతను మైనస్ 32 డిగ్రీల సెల్సియస్ (-32°C) కు తగ్గించారు. ఈ ఉష్ణోగ్రత వద్ద మెదడు కణజాలం వందల సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉంటుంది.
ఈ ప్రయోగం తర్వాత సూక్ష్మదర్శిని (Microscope) ద్వారా పరీక్షించగా, మెదడులోని నాడీ వ్యవస్థ అత్యంత సురక్షితమైన స్థితిలో భద్రపరచబడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
దీనివల్ల ప్రయోజనాలు ఏంటి..?
ప్రస్తుతానికి ఇది చనిపోయిన వారిని తిరిగి బ్రతికించే ప్రక్రియ కానప్పటికీ, భవిష్యత్తు వైద్య శాస్త్రానికి ఇది ఒక మైలురాయి కానుంది.
ఇలా భద్రపరిచిన మెదళ్లను అధ్యయనం చేయడం ద్వారా అల్జీమర్స్, పార్కిన్సన్స్, డిమెన్షియా వంటి ప్రమాదకరమైన మస్తిష్క వ్యాధులపై మెరుగైన అవగాహన వస్తుంది.
మెదడు గుట్టు..
జ్ఞాపకాలు, ఆలోచనలు మెదడులో ఎలా నిల్వ ఉంటాయో తెలుసుకోవడానికి, మానవ మెదడు సంక్లిష్టమైన పటాన్ని (Map) రూపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది.
సవాళ్లు.. సందేహాలు..!
ఈ ఆవిష్కరణ అద్భుతమైనదే అయినప్పటికీ, దీని ముందు ఇంకా ఎన్నో మైలురాళ్లు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఒక చిన్న ఎలుక మెదడులోని కొంత భాగాన్ని మ్యాప్ చేయడానికే శాస్త్రవేత్తలకు దాదాపు ఏడేళ్లు పట్టింది. మానవ మెదడు దానికంటే వెయ్యి రెట్లు పెద్దది, మరెంతో సంక్లిష్టమైనది.
ఇది కేవలం రసాయనిక సంరక్షణ మాత్రమేనని, కణాల నిర్మాణాన్ని దాచగలమే తప్ప ప్రస్తుత సాంకేతికతతో వాటికి తిరిగి జీవం పోయలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులో మెదడులోని సమాచారాన్ని డిజిటల్‌గా భద్రపరిచినా.. అది అసలు వ్యక్తి అవుతాడా లేక కేవలం ఒక నకలు (Copy) మాత్రమే అవుతుందా..? అనే నైతిక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ, గుండె ఆగిపోయిన వెంటనే మెదడులోని సమాచారం అంతా ఒక్కసారిగా మాయం కాదని, సరైన సమయంలో ప్రయత్నిస్తే దానిని భద్రపరచవచ్చని ఈ ప్రయోగం నిరూపించింది. భవిష్యత్తులో మానవ మెదళ్లను ఈ విధంగా భద్రపరచగలిగితే, అది మానవ పరిణామ క్రమంలోనే ఒక సరికొత్త విప్లవానికి నాంది కానుంది.
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
