New Study on Brain Function : మెదడు పనితీరుపై న్యూ స్టడీ.. నిద్రలేమి యువత కంటే వృద్ధులపై తక్కువ ప్రభావం చూపుతుందా..?
సాక్షి లైఫ్ : సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శారీరక బలంతో పాటు మెదడు పనితీరు కూడా మందగిస్తుందని, జ్ఞాపకశక్తి తగ్గుతుందని మనం భావిస్తుంటాం. అందులోనూ రాత్రిపూట నిద్ర సరిపోకపోతే మరుసటి రోజు తీవ్రమైన అలసట, చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే, నిద్రలేమి ప్రభావం వృద్ధుల కంటే యువత మెదడుపైనే ఎక్కువగా ఉంటుందని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది. పరిస్థితులకు అనుగుణంగా మెదడు తన పనితీరును మార్చుకునే అద్భుత శక్తే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
అధ్యయనంలో..
మెదడు పనితీరు, నిద్రలేమి ప్రభావాలను తెలుసుకోవడానికి పరిశోధకులు రెండు వేర్వేరు వయసుల వారిపై అధ్యయనం చేశారు. ఒక బృందంలో 20 నుంచి 30 ఏళ్ల యువతను, మరో బృందంలో 65 నుంచి 75 ఏళ్ల ఆరోగ్యవంతమైన వృద్ధులను చేర్చుకున్నారు. వీరికి ఒక రోజు పూర్తిస్థాయిలో నిద్రపోయే అవకాశం ఇచ్చి, మరో రోజు కేవలం మూడు గంటలు మాత్రమే నిద్రపోయేలా చేసి వారి మెదడు నెట్‌వర్క్‌లలో వచ్చే మార్పులను విశ్లేషించారు.
వృద్ధుల మెదడు ఎలా సర్దుబాటు చేసుకుంటుంది..?
వయసు పెరిగే కొద్దీ మెదడులో కొన్ని సహజ మార్పులు చోటుచేసు కుంటాయి. మెదడు బయటి పొర పలచబడటం (cortical thinning), కొన్ని భాగాల పరిమాణం తగ్గడం వంటి సవాళ్లు ఎదురవుతాయి. అయినప్పటికీ, మెదడుకు ఉండే 'న్యూరోప్లాస్టిసిటీ' (పరిస్థితులకు అనుగుణంగా నాడీ కణాల మధ్య కొత్త సంబంధాలను ఏర్పరుచుకునే శక్తి) వృద్ధాప్యంలోనూ చురుగ్గా పనిచేస్తుందని ఈ పరిశోధన నిరూపించింది.
బ్రెయిన్ మాడ్యులారిటీ..
కేవలం మూడు గంటలు మాత్రమే నిద్రపోయిన తర్వాత, వృద్ధుల మెదడులోని దూరంగా ఉన్న కొన్ని భాగాల మధ్య అనుసంధానం తగ్గి, దగ్గరగా ఉన్న భాగాలు చిన్నచిన్న సమూహాలుగా (networks) ఏర్పడి మరింత క్రమబద్ధంగా పనిచేయడం ప్రారంభించాయి. దీనినే 'బ్రెయిన్ మాడ్యులారిటీ' పెరగడం అంటారు. దీనివల్ల నిద్ర తక్కువైనా వారి ఆలోచనా శక్తి, మూడ్‌పై పెద్దగా ప్రతికూల ప్రభావం పడలేదు.
యువతపై తీవ్ర ప్రభావం..
మరోవైపు, నిద్రలేమి కారణంగా యువత మెదడులో ఈ 'మాడ్యులారిటీ' గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. ఫలితంగా మరుసటి రోజు వారి ఆలోచనా సామర్థ్యం, ఏకాగ్రతపై తీవ్ర ప్రభావం పడింది.
అల్జీమర్స్ ముప్పును తగ్గించుకోవచ్చా..?
వయసుతో పాటు వచ్చే ప్రతి మార్పూ హానికరమైనది కాదని, కొన్ని మార్పులు మెదడు తనను తాను రక్షించుకోవడానికి చేసుకునే సర్దుబాట్లని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, మెదడు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినంత నిద్రపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఎంతో అవసరమని, ఇవి భవిష్యత్తులో అల్జీమర్స్ వంటి మతిమరుపు వ్యాధుల ముప్పును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
