Soft Drinks : రోగనిరోధక శక్తి తోపాటు, కీలక అవయవాలనుదెబ్బతీస్తున్న శీతల పానీయాలు: తాజా పరిశోధనలో వెల్లడి..
సాక్షి లైఫ్ : ఎండ వేడి నుంచి ఉపశమనం కోసమో లేదా సరదాగానో తాగే శీతల పానీయాలు మన శరీరానికి చేసే ముప్పు అంతా ఇంతా కాదని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా బరువు పెరగడం లేదా రక్తంలో చక్కెర స్థాయిలు మారడం వంటి లక్షణాలు పైకి కనిపించకపోయినా.. లోలోపల రోగనిరోధక వ్యవస్థను, కీలక అవయవాలను ఇవి దెబ్బతీస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
'ఫ్రంటియర్స్ ఇన్ న్యూట్రిషన్' జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం, పంచదార ఉన్న కోలాలు మాత్రమే కాదు, 'షుగర్ ఫ్రీ' పేరుతో వచ్చే డైట్ సోడాలు కూడా ప్రమాదకరమేనని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
రోగనిరోధక కణాలపై ప్రభావం..
ఎనిమిది వారాల పాటు నీటికి బదులుగా శీతల పానీయాలను తీసుకున్న ఎలుకల్లో తెల్ల రక్త కణాల (WBC) సంఖ్య గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు కనుగొన్నారు. దీనివల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం మరింతగా క్షీణిస్తుంది.
రోగనిరోధక శక్తిలో కీలక పాత్ర పోషించే థైమస్ గ్రంథి పరిమాణం తగ్గడం (Atrophy) గమనించారు. అదే సమయంలో ప్లీహం పరిమాణం పెరగడం (Splenomegaly) ద్వారా శరీరంలో అంతర్గత మార్పులు జరుగుతున్నట్లు గుర్తించారు.
పేగుల్లోని సూక్ష్మజీవులు..
మన ఆరోగ్యం మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా (Microbiota)పై ఆధారపడి ఉంటుంది. శీతల పానీయాలు తాగడం వల్ల ఈ సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతింటున్నట్లు అధ్యయనం తేల్చింది. జీర్ణక్రియకు, ఆరోగ్యానికి మేలు చేసే 'లాక్టోబాసిల్లస్' వంటి బ్యాక్టీరియాల సంఖ్య కూల్ డ్రింక్స్ ప్రభావంతో తగ్గిపోయింది. హానికరమైన బ్యాక్టీరియాలు పెరగడం వల్ల మూత్రపిండాలు, కాలేయంపై ఒత్తిడి పెరుగుతున్నట్లు రక్త పరీక్షల్లో తేలింది.
కాలేయం, మూత్రపిండాలపై ఒత్తిడి..
కేవలం పంచదార ఉన్న కోలా మాత్రమే కాదు, కృత్రిమ తీపి పదార్థాలు ఉండే 'డైట్' వల్ల కూడా కాలేయంలో ఎంజైముల (ALT, AST) స్థాయిలు పెరిగాయి. ఇది కాలేయ ఒత్తిడికి సంకేతం. అలాగే, సాధారణ శీతల పానీయాలు తాగిన వారిలో మూత్రపిండాల పనితీరుపై భారం పడుతున్నట్లు 'బ్లడ్ యూరియా నైట్రోజన్' (BUN) స్థాయిల పెరుగుదల ద్వారా వెల్లడైంది.
ముప్పు పొంచి ఉంది.. జాగ్రత్త..!
చాలామంది డైట్ సోడాలు ఆరోగ్యకరమని భావిస్తారు, కానీ ఈ పరిశోధన ప్రకారం అవి కూడా శరీరానికి హానికరమే. బరువు పెరగడం వంటి బాహ్య లక్షణాలు కనిపించకపోయినా, అంతర్గతంగా అవయవాల పనితీరు మందగిస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
దాహం వేసినప్పుడు శీతల పానీయాల కంటే స్వచ్ఛమైన నీరు లేదా సహజ సిద్ధమైన పండ్ల రసాలు తీసుకోవడమే ఉత్తమం. ఈ అధ్యయనం ఎలుకలపై జరిగినప్పటికీ, మానవ ఆరోగ్యంపై కూడా ఇవి ఇలాంటి ప్రభావాలే చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
