న్యూ స్టడీ : ఆకస్మిక మరణాలకు కోవిడ్ కారణం కాదు..  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఇటీవలి కాలంలో, గుండె ఆగిపోవడం వల్ల చాలా మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. దీనికి కోవిడ్-19 వ్యాక్సిన్‌లే కారణమని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆకస్మిక మరణాలకు కారణాన్ని తెలుసుకోవడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) అధ్యయనం నిర్వహించింది. అందులో భాగంగా ఐసీఎమ్ఆర్, చెన్నై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ విభాగం సంయుక్తంగా ఆకస్మిక మరణాల సంఘటనలను పరిశోధించడానికి ప్రత్యేకంగా ఓ అధ్యయనాన్ని చేపట్టాయి. ఇందులో ఆకస్మిక మరణాలకు కోవిడ్-19 వ్యాక్సిన్ కారణం కాదని తేల్చాయి.

కార్డియాక్ అరెస్ట్ అంటే..?

సడెన్ కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె పనిచేయడం ఆగిపోవడం లేదా రక్తం పంపింగ్ ఆగిపోతుంది. దీనికి ముందుగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. గుండెలో ఎలక్ట్రిక్ అలజడి తలెత్తడంవల్ల గుండె కొట్టుకోవడంలో సమతుల్యత దెబ్బతింటుంది. అప్పుడు గుండె, మెదడుతోపాటు ఇతర శరీర భాగాలకు రక్తం సరఫరా ఆగిపోతుంది. దీనివల్ల కార్డియాక్ అరెస్ట్ సంభవించిన వ్యక్తి స్పృహ కోల్పోతాడు. ఇది ఎటువంటి హెచ్చరిక లేకుండాజరుగుతుంది. కాబట్టి, దీనిని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు.

ఈ అధ్యయనం ఏమిటి..?

ఈ అధ్యయనంలో, అక్టోబర్ 2021, మార్చి 2023 మధ్య ఎటువంటి వ్యాధి లేని హఠాత్తుగా మరణించిన 18-45 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యవంతుల గురించి ఒక కేస్ స్టడీ నిర్వహించారు. ఈ వ్యక్తుల గురించిన డేటా మౌఖిక ప్రశ్నపత్రాల ద్వారా సేకరించారు. ఇందులో కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్, టీకా, ఆసుపత్రిలో చేరడం, జీవనశైలి అలవాట్లు ,వారి మరణానికి 48 గంటల ముందు చేసిన శారీరక శ్రమ గురించిన ప్రశ్నలు ఉన్నాయి.

ఈ అధ్యయనంలో.. 
 
ఈ అధ్యయనంలో ఈ మరణాలకు కోవిడ్ -19 వ్యాక్సిన్ కారణం కాదని ICMR-NIE శాస్త్రవేత్తలు తేల్చారు. రెండు మోతాదుల వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులలో కోవిడ్‌కు సంబంధించిన ప్రమాదం తక్కువగా ఉందని, వ్యాక్సిన్ ఒక్క డోస్ కూడా తీసుకోని వారిలో రిస్క్ ఎక్కువగా ఉందని గుర్తించారు.

కుటుంబ చరిత్ర.. 

అయితే, కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరడం, ఆకస్మిక మరణానికి సంబంధించిన కుటుంబ చరిత్ర, ధూమపానం, మద్యం సేవించడం, మరణానికి ముందు 48 గంటలలో మరింత తీవ్రమైన శారీరక శ్రమ మొదలైనవి గుండె ఆగిపోయే ప్రమాదాన్నిపెంచుతాయని ఈ పరిశోధన ద్వారా నిర్ధారించారు.

ఈ అధ్యయనం సడెన్ కార్డియాక్ అరెస్ట్‌లు ప్రమాదవశాత్తు కాదని స్పష్టం చేసింది. వ్యక్తి  వైద్య చరిత్ర, జీవనశైలి వాటిలో ప్రధాన పాత్ర పోషిస్తాయని ఐసీఎమ్ఆర్, చెన్నై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ విభాగం నిర్వహించిన స్టడీలో వెల్లడయ్యింది.

ఇది కూడా చదవండి.. ఎన్నినిమిషాల్లో ఎంత దూరం నడిస్తే హార్ట్ రేట్ మెరుగుపడుతుంది..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.