జీవితకాలాన్ని పొడిగించేందుకు ఔషధం..
సాక్షి లైఫ్ : శాస్త్రీయ పరంగా జీవితకాలాన్ని పెంచడానికి పరిశోధనలు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో ప్రపంచదేశాలు సైతం గందరగోళానికి గురైన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఎట్టకేలకు మనిషి జీవితకాలాన్ని పొడిగించే మందులను అభివృద్ధి చేయడానికి పరిశోధకుల ప్రయత్నాలు ఫలిస్తున్నాయని తాజా నివేదికలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి..పెరుగులో చక్కెర వేసుకుని తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..పేగును శుభ్రపరచడం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఆయుర్దాయం 25 శాతం..
జీవితకాలాన్ని పొడిగించేందుకు రూపొందించిన ఔషధాన్ని జంతువులలో విజయవంతంగా పరీక్షించారు. ఇందుకు సంబంధించిన ప్రయోగం ఎలుకలపై చేశారు శాస్త్రవేత్తలు. ఈ అధ్యయనంలో ఎలుకలలో ఆయుర్దాయం 25 శాతం పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. కౌన్సిల్ లాబొరేటరీ ఆఫ్ మెడికల్ సైన్స్ (MRC LMS), ఇంపీరియల్ కాలేజ్ లండన్, సింగపూర్‌లోని డ్యూక్-NUS మెడికల్ స్కూల్ సంయుక్తంగా విజయవంతంగా ప్రయోగాన్ని పూర్తిచేశాయి. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫలితాలు 'నేచర్' జర్నల్‌లో ప్రచురించారు.
ఎలుకలకు..
ఈ అధ్యయనంలో ఫలితాలు ఎలుకలకు మాత్రమే అనుకూలంగా ఉన్నాయని, మనుషులు ఈ ప్రయోజనాన్ని పొందడానికి ఇంకొన్ని ప్రయోగాలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. శరీరంలోని ఇంటర్‌లుకిన్-11 అనే ప్రోటీన్ వృద్ధాప్య సంకేతాలను వేగవంతం చేస్తుంది. ఇది శరీరం పెరుగుదలకు మొదట్లో అవసరం. పెరుగుదల పూర్తయిన తర్వాత, ఈ ప్రోటీన్ అవసరం ఉండదు. పూర్తి ఎదుగుదల తర్వాత ఈ ప్రోటీన్ ఉత్పత్తి కాకపోతే, 'వృద్ధాప్యం' ప్రక్రియ మందగిస్తుంది. ఈ ప్రయోగం వెనుక ఉన్న సూత్రం ఇదే.
ఈ విధంగా శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక దశలో ఎలుకల జన్యు నిర్మాణాన్ని మార్చడానికి ప్రయత్నించారు. 75 వారాల వయస్సు తర్వాత, ప్రోటీన్ ఉత్పత్తిని తగ్గించే మందు ప్రతిరోజూ ఇచ్చారు. ఈ మందు ఇవ్వని వాటి కంటే, మందు ఇచ్చిన ఎలుకలు ఆరోగ్యంగా ఉన్నాయని, మెరుగైన రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
క్యాన్సర్..
అంతేకాదు అవి క్యాన్సర్‌ను కూడా తట్టుకుని నిలబడగలిగాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఐతే దీనిని మనుషులపై కూడా పరీక్షించారు. కానీ, ఫలితాలు స్పష్టంగా కనిపించడానికి ఇంకా కొంత సమయం పడుతుందని వారు చెబుతున్నారు. ఈ రకమైన ఔషధం మానవులలో ఎలాంటి దుష్ప్రభావాలను కలిగిస్తుందో తెలుసుకోవడం కూడా ముఖ్యమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి.. హోమియోపతి వైద్యంలో క్యేన్సర్ కు చికిత్స ఉందా..?
ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
