Latest Study : మహిళల గుండెకు 'ఒత్తిడి' ముప్పు.. తాజా అధ్యయనాల్లో సంచలన విషయాలు..!
సాక్షి లైఫ్ : శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంత ముఖ్యమో తాజా వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇల్లు, కుటుంబం, పిల్లలు, ఉద్యోగ బాధ్యతల మధ్య మహిళలు తరచూ తమ మానసిక ఒత్తిడిని, ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆర్థిక ఇబ్బందులు లేదా ఆత్మీయులను కోల్పోయిన బాధ.. కారణం ఏదైనా దీర్ఘకాలిక ఒత్తిడి మాత్రం మహిళల గుండెకు తీవ్ర ప్రాణాపాయంగా మారుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?
ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
గుండెకు రక్తప్రసరణ..
దీర్ఘకాలిక ఒత్తిడి (chronic stress) పురుషుల కంటే మహిళల గుండెపైనే ఎక్కువ దుష్ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 2014లో అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ 310 మంది హృద్రోగులపై ఒక అధ్యయనం చేసింది. దీని ప్రకారం..తీవ్రమైన ఒత్తిడికి గురైన సమయంలో మహిళల గుండెకు చేరే రక్తప్రసరణ గణనీయంగా తగ్గుతున్నట్లు గుర్తించారు. రక్తంలో ప్లేట్లెట్లు ఒకదానికొకటి అతుక్కుపోయి రక్తం గడ్డకట్టే (blood clotting risk) ప్రమాదం మహిళల్లో ఎక్కువగా కనిపించింది. రక్తనాళాల్లో ఈ క్లాట్స్ అడ్డంకులుగా మారి హార్ట్ ఎటాక్‌కు దారితీస్తాయి.
ప్రాణాంతక 'ఎస్‌సీఏడీ' (SCAD) ముప్పు..
ఒత్తిడి అనేది కేవలం రక్తప్రసరణను తగ్గించడమే కాకుండా 'స్పాంటేనియస్ కరోనరీ ఆర్టరీ డిసెక్షన్' (SCAD) అనే అత్యంత అరుదైన, ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఈ సమస్య తలెత్తినప్పుడు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల లోపలి గోడలలో అకస్మాత్తుగా చీలికలు ఏర్పడతాయి. ఈ పగుళ్ల మధ్యలోకి రక్తం చేరిపోవడం వల్ల రక్తప్రవాహానికి తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఫలితంగా గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ అందక తీవ్రమైన హార్ట్ ఎటాక్ వస్తుంది. బరువైన వస్తువులు ఎత్తడం లేదా ఆత్మీయులు దూరం కావడం లాంటి తీవ్రమైన శారీరక, భావోద్వేగ ఒత్తిడులకు లోనైనప్పుడు శరీరంలో స్ట్రెస్ హార్మోన్లు అకస్మాత్తుగా పెరిగిపోయి ఈ పరిస్థితికి దారితీస్తాయి.
బాధితుల్లో 90 శాతం మహిళలే..!
ఎస్‌సీఏడీ (SCAD) కేసుల్లో దాదాపు 90 శాతం మంది మహిళలే ఉంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. యువతుల నుంచి వృద్ధుల వరకు ఏ వయసు వారైనా దీని బారిన పడే అవకాశం ఉంది. మహిళల గుండె, రక్తనాళాల నిర్మాణంలో ఉండే కొన్ని ప్రత్యేకతల వల్ల వారు దీని బారిన ఎక్కువగా పడుతున్నారు.
అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే..హై బీపీ, మధుమేహం (diabetes), అధిక కొలెస్ట్రాల్ వంటి గుండె జబ్బుల సాధారణ లక్షణాలు ఏమీ లేని ఆరోగ్యకరమైన మహిళల్లో కూడా కేవలం ఈ 'తీవ్రమైన ఒత్తిడి' కారణంగా హార్ట్ ఎటాక్ వస్తుండటం. కాబట్టి మహిళలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతపై కూడా దృష్టి సారించాలని, ఒత్తిడిని ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?
ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
