సాక్షి లైఫ్ : మనందరం రోజూ ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తూ ఉంటాం. స్కూల్, కాలేజ్, ఆఫీస్, ప్రయాణాల్లోనూ దాదాపు అన్ని చోట్లా మనం నీరు తాగేందుకు ప్లాస్టిక్ బాటిళ్లనే వాడుతుంటాం. అయితే, ఈ నీరు మన ఆరోగ్యానికి చాలా హానికరమని పరిశోధకులు చెబుతున్నారు. దీని సంబంధించి తాజా అధ్యయనంలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి.
ఈ కొత్త అధ్యయనం ప్రకారం.. ఒక సాధారణ ఒక-లీటర్ బాటిల్‌లో సగటున 240,000 ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయి. ఈ స్టడీలో పరిశోధకులు నానోప్లాస్టిక్ కణాలపై దృష్టి పెట్టారు. ఇవి మైక్రోప్లాస్టిక్‌ల కంటే కూడా చిన్నగా ఉండే కణాలు. యుఎస్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన బృందం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్లాస్టిక్ బాటిల్స్ లోని సూక్ష్మ కణాల గుర్తించింది. ఇలా గుర్తించడం ఇదే మొదటిసారి. బాటిళ్లలో ఉండే చిన్న ప్లాస్టిక్ ముక్కలు మన ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కొత్త అధ్యయనం గురించి వివరంగా తెలుసుకుందాం..
అధ్యయనంలో ఏం తేలింది..?
ఈ అధ్యయనం ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ సరికొత్త స్టడీ ప్రకారం.. ప్లాస్టిక్ బాటిల్ నీటిలో గతంలో అనుకున్నదానికంటే 100 రెట్లు ఎక్కువ ప్లాస్టిక్ కణాలున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నానోప్లాస్టిక్ ముక్కలు చాలా చిన్నవి, మైక్రోప్లాస్టిక్‌ల మాదిరిగా కాకుండా, అవి నేరుగా ప్రేగులు, ఊపిరితిత్తుల నుంచి రక్తప్రవాహంలోకి ప్రవేశించగలవు. అక్కడ నుంచి గుండె, మెదడుతో సహా ఇతర అవయవాలకు చేరుతాయి.
ప్లాస్టిక్ బాటిల్స్ లో నీరు తాగడం వల్ల..
మైక్రోప్లాస్టిక్‌ల కంటే నానోప్లాస్టిక్‌లు మన ఆరోగ్యానికి ఎక్కువ ముప్పు కలిగిస్తాయి. ఎందుకంటే..? అవి మన కణాలు, రక్తంలోకి ప్రవేశించి మన అవయవాలను ప్రభావితం చేసేంత చిన్నవిగా ఉంటాయి. నానోప్లాస్టిక్‌లు బొడ్డు తాడు ద్వారా పుట్టబోయే బిడ్డ శరీరంలోకి కూడా ప్రవేశిస్తాయి.
ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రభావం పడుతుందంటే..?
రొమ్ము క్యాన్సర్..
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కు ఎండ తగిలినప్పుడు డయాక్సిన్ అనే విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ డయాక్సిన్ మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌కు కారణమవుతుంది.
మధుమేహం..
ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం వల్ల కూడా మధుమేహం వస్తుంది. వాస్తవానికి, బైఫినైల్ "ఏ" అనేది ఈస్ట్రోజెన్-అనుకరించే రసాయనం. ఇది మధుమేహం, స్థూలకాయం, పునరుత్పత్తి సమస్యలతోపాటు, పలురకాలుగా ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి కారణమవుతుంది.
రోగనిరోధక శక్తి సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ప్లాస్టిక్ బాటిళ్లతో తయారైన రసాయనాలతో కూడిన నీటిని తాగడం వల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది.
కాలేయ క్యాన్సర్..
ప్లాస్టిక్‌లో లభించే థాలేట్స్ అనే రసాయనాలు కాలేయ క్యాన్సర్‌కు కారణమవుతాయి. అంతేకాదు వీటివల్ల మగవారిలో స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గుతుంది.
ప్లాస్టిక్ బాటిల్ కు బదులు..
ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల తలెత్తే హానికరమైన ప్రభావాలను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ప్లాస్టిక్ బాటిల్స్ కు ప్రత్యామ్నాయంగా ఇతర బాటిళ్లను వాడాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్‌కు బదులుగా కాపర్ బాటిల్స్, గ్లాస్ బాటిల్స్,స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లను వినియోగించవచ్చని వారు వెల్లడిస్తున్నారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com