మందు అలవాటు లేనివాళ్లకు కూడా లివర్ ఎందుకు పాడవుతుందో తెలుసా..? 

సాక్షి లైఫ్: మన శరీర అవయవాల్లో పునరుత్పత్తి అయ్యే ఒకేఒక అవయవం కాలేయం. అందుకే వైద్యులు దీనిని ఫ్రెండ్లీ ఆర్గాన్‌ అని పిలుస్తారు. అటువంటి కాలేయాన్ని మనం ఒక మంచి స్నేహితుడిలా జాగ్రత్తగా చూసుకోవాలని, ఏం కాదులే అని అశ్రద్ధ చేస్తే ప్రాణానికే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే కాలేయ ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని వారు సూచిస్తున్నారు. కాలేయాన్ని ఆరోగ్యం ఉంచుకోవాలంటే ఏం చేయాలి..? 


భారత్‌లో ప్రతి ఏటా దాదాపు పది లక్షల మంది లివర్ సమస్యల బారిన పడుతున్నారు. వారిలో లివర్‌ సిర్రోసిస్‌ కేసులు కూడా ఉంటున్నాయని వైద్యులు చెపుతున్నారు. ఆహారపు అలవాట్లు కారణంగా ప్రతి వంద మందిలో 60 మందికి ఫాటీ లివర్‌ ఉంటుండగా, 15 శాతం మందిలో గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. లివర్‌ సిర్రోసిస్‌కు గురైన వారిలో ఆల్కహాల్‌ తాగే వారితో పాటు, ఆల్కాహాల్‌ తాగని వారు సైతం ఆ వ్యాధికి గురవడం ఆందోళన కలిగిస్తోంది.

లివర్‌ సమస్యలు ఎక్కువగా మధుమేహులు, హోపోథైరాయిడ్‌ ఉన్న వారు, హెపటైటీస్‌ సి, రక్తంలో కొలస్ట్రాల్‌ స్థాయిలు అబ్‌నార్మల్‌గా ఉన్న వారిలో వస్తున్నాయి. ఫాటీలివర్‌ కామన్‌గా భావించి అశ్రద్ధ చేస్తుండటంతో అది కాస్తా సిర్రోసిస్‌కు దారితీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 

ఫాటీలివర్‌ గ్రేడ్‌ 1,గ్రేడ్‌ 2, గ్రేడ్‌ 3లో దుష్ఫలితాలు లేకుండా చూడవచ్చని, కానీ సిర్రోసిస్‌కు దారితీస్తే లివర్‌ గట్టిపడి వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదని, లివర్‌ ఫంక్షన్‌లో తేడా వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ పరిస్థితుల్లో లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయడం ఒక్కటే మార్గమని అంటున్నారు.

శారీరక శ్రమలేని జీవన విధానానికి ప్రతి ఒక్కరూ అలవాటు పడ్డారు. దానికి తోడు ఫాట్‌ ఎక్కువగా ఉన్న జంక్‌ఫుడ్స్‌ తింటున్నారు. దీంతో శరీరంలో కొలస్ట్రాల్‌ స్థాయిలు విపరీతంగా పెరిగి, లివర్‌పై ప్రభావం చూపుతున్నాయి. 

వయస్సు 40 ఏళ్లు దాటిన వారు ప్రతి ఏటా లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌, కొలస్ట్రాల్‌ లెవల్స్‌, థైరాయిడ్‌, షుగర్‌ పరీక్షలతో పాటు, ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ కూడా చేయించుకుంటే మంచిది. ఇప్పుడు లివర్‌ పనితీరును కచ్చితంగా నిర్ధారించేందుకు ఫైబ్రో స్కాన్‌ అందుబాటులోకి వచ్చింది. ఆయా పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారించుకుని ముందు జాగ్రత్తలు తీసుకుంటే మేలని వైద్యులు సూచిస్తున్నారు. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.


 

Tags : liver-health

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com