Heart Disease Crisis in India : భారతదేశంలో ‘గుండె’ కోత.. ప్రతి మూడు మరణాల్లో ఒకటి హార్ట్ డిసీజ్ వల్లే..! : తాజా నివేదిక..

షేర్ చేయండి:
Heart Disease Crisis in India : భారతదేశంలో ‘గుండె’ కోత.. ప్రతి మూడు మరణాల్లో ఒకటి హార్ట్ డిసీజ్ వల్లే..! : తాజా నివేదిక..

సాక్షి లైఫ్ : భారతదేశంలో గుండె జబ్బులు మహమ్మారిలా విస్తరిస్తున్నాయి. దేశంలో నమోదవుతున్న మొత్తం మరణాలలో దాదాపు ప్రతి మూడు మరణాల్లో ఒకటి గుండె జబ్బుల కారణంగానే సంభవిస్తోందని సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ విడుదల చేసిన తాజా నివేదిక (2022-24) స్పష్టం చేసింది. దేశంలో అత్యధికంగా 32.1 శాతం మరణాలకు హృదయ సంబంధిత వ్యాధులే కారణమని ఈ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, విపరీతమైన ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల రాబోయే రోజుల్లో ఈ ఆరోగ్య సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

 

ఉత్తరాదిలోనే తీవ్రత ఎక్కువ..

ఈ నివేదిక ప్రకారం.. గుండె జబ్బుల ప్రభావం దేశవ్యాప్తంగా ఒకేలా లేదు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. అక్కడ గుండె జబ్బుల వల్ల సంభవిస్తున్న మరణాల రేటు అత్యధికంగా 35.1 శాతానికి చేరుకోగా, మధ్య భారతదేశంలో ఇది 24.1 శాతంగా నమోదైంది. గతంలో నగరాలకే పరిమితమనుకున్న ఈ హృద్రోగాలు, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు సైతం వేగంగా విస్తరిస్తుండటం గమనార్హం. చిన్న వయసులోనే రక్తపోటు (BP), మధుమేహం బారిన పడటం నేరుగా గుండె ఆరోగ్యంపై దెబ్బతీస్తోందని వైద్యులు చెబుతున్నారు. నిరంతర ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, జంక్ ఫుడ్ సంస్కృతి, ఊబకాయం దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో సంభవిస్తున్న మొత్తం మరణాలలో వివిధ వ్యాధుల వాటాను పరిశీలిస్తే ఆందోళనకరమైన నిజాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో అత్యధికంగా 32.1 శాతం మరణాలతో హృదయ సంబంధ వ్యాధులు (గుండె జబ్బులు) మొదటి స్థానంలో నిలిచి ప్రధాన ముప్పుగా మారాయి. దీని తర్వాత శ్వాసకోశ వ్యాధులు 6.0 శాతం మరణాలకు కారణమవుతుండగా, జీర్ణాశయ సంబంధిత వ్యాధులు 5.9 శాతం వాటాతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి.

అలాగే, శరీరంలో రోగనిరోధక శక్తిని దెబ్బతీసే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్ల 5.7 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యాధులే కాకుండా, ఊహించని గాయాలు, ప్రమాదాల కారణంగా 4.1 శాతం మరణాలు నమోదవుతున్నాయి. ఆధునిక జీవనశైలి శాపంగా మారిన మధుమేహం (షుగర్) 3.6 శాతం మరణాలకు కారణమవుతుండగా, శతాబ్దాలుగా వేధిస్తున్న క్షయవ్యాధి (టీబీ) ఇప్పటికీ 2.6 శాతం మరణాల వాటాతో దేశ ఆరోగ్య భద్రతకు పెద్ద సవాల్‌గా నిలుస్తోంది.

దక్షిణాదిని వేధిస్తున్న ‘మధుమేహం’..

గుండె జబ్బుల తర్వాత శ్వాసకోశ వ్యాధులు (6 శాతం), జీర్ణకోశ వ్యాధులు (5.9 శాతం), శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు (5.7 శాతం) దేశంలో ప్రధాన మరణ శాసనాలుగా మారుతున్నాయి. మరోవైపు మధుమేహం (షుగర్) తీవ్రత కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మధుమేహం కారణంగా అత్యధికంగా 4.8 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. ఇవే కాకుండా వివరించలేని జ్వరాలు, ప్రమాదాలు, జననేంద్రియ సంబంధిత వ్యాధులు, ఇప్పటికీ దేశానికి ముప్పుగా ఉన్న క్షయవ్యాధి (2.6%) కూడా మరణాలకు కీలక కారణాలుగా ఉన్నాయి.

పురుషులు Vs మహిళలు: తేడాలు..

వ్యాధుల ప్రభావం పురుషులు, మహిళలపై వేర్వేరుగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. జీర్ణాశయ సంబంధిత వ్యాధుల వల్ల పురుషులలో 7.7శాతం మరణాలు సంభవిస్తుండగా, మహిళలలో ఇది 3.4శాతం గానే ఉంది. అలాగే జననేంద్రియ సంబంధిత వ్యాధుల కారణంగా పురుషులలో 3.8శాతం, మహిళల్లో 2.9శాతం మరణాలు నమోదయ్యాయి. పురుషులలో ధూమపానం, మద్యపాన అలవాట్లు, పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రమాదం పెరుగుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో మహిళలు తమ సొంత ఆరోగ్య పరీక్షల పట్ల నిర్లక్ష్యం వహించడం కూడా ఆందోళన కలిగించే అంశంగా మారింది.

 ఆయుర్దాయం పెరిగినప్పటికీ.. 

ఆధునిక వైద్య సాంకేతికత, మెరుగైన చికిత్సలు, సకాలంలో అందుతున్న టీకాల వల్ల దేశంలో చిన్న వయసులోనే సంభవించే మరణాలు తగ్గాయని, ప్రజల సగటు ఆయుర్దాయం పెరిగిందని నివేదిక సానుకూల అంశాన్ని వెల్లడించింది. అయితే, 70 ఏళ్లు పైబడిన వృద్ధులలో మరణాల సంఖ్య పెరిగింది. వీరిలో చాలావరకు ఖచ్చితమైన కారణం తెలియని వృద్ధాప్య సమస్యల వల్లే మరణాలు సంభవిస్తున్నాయి. వైద్య సదుపాయాలు విస్తరించినప్పటికీ, జీవనశైలి వ్యాధులు పెరగడం భవిష్యత్తుకు పెద్ద సవాల్‌గా మారనుంది.

 ఏం చేయాలి..?

 ప్రతి ఒక్కరూ నిర్ణీత వ్యవధిలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఆహార నియమాలు..జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ.. పీచుపదార్థాలు, పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. శారీరక శ్రమ..నిత్యం కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు నడక, వ్యాయామం లేదా యోగా అలవాటు చేసుకోవాలి.

ఒత్తిడి నిర్వహణ..మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం, తగినంత నిద్ర అవసరం. ప్రభుత్వ కార్యక్రమాలు..యువత, బాలల్లో మరణాలను నివారించేందుకు జాతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని నివేదిక స్పష్టం చేసింది.

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.